టన్నుల కొద్ది బెల్లం సమర్పించినా మేడారంలో ఈగలు కనిపించకపోవడం అమ్మవార్ల మహిమగా భక్తులు నమ్మే అద్భుతం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో, బెల్లాన్ని బంగారంతో సమానంగా భావించి లక్షలాది మంది భక్తులు మొక్కులుగా సమర్పిస్తారు. గద్దెల చుట్టూ ఎక్కడ చూసినా బెల్లమే కనిపించినా… బెల్లం దగ్గర ముసురుకునే ఈగలు మాత్రం జాతర జరిగే నాలుగు రోజులు దరిచేరవు. ఇది వనదేవతల దివ్యశక్తి అని భక్తుల విశ్వాసం. అమ్మవార్లు గద్దెలపై కొలువుతీరినంతకాలం దుష్టశక్తులే కాదు, కీటకాలు కూడా ఆ పరిధిలోకి రాలేవట. అటవీ ప్రాంతం, వేపచెట్లు, ధూపదీపాల వాతావరణం ఇవన్నీ ఈగలు, కీటకాలు రాకుండా ఉండేందుకు కారణాలైనా అసలు రహస్యం అమ్మవారి చల్లని చూపే అంటారు భక్తులు. జాతర ముగిసి దేవతలు వనప్రవేశం చేసిన తర్వాతే కీటకాలు, ఈగలు వంటివి తిరిగి ఈ ప్రాంతంలోకి వస్తాయని అంటారు. ఇదే మేడారం మహిమ.

