నాసిక్‌లోని త్రయంబకేశ్వర క్షేత్రం గురించి ఎన్నో విషయాలను తెలుకున్నాం కదా. ఆ క్షేత్రంలో త్రిమూర్తులు ఎందుకు కొలువుదీరారో.. ఆ ప్రాంతానికి గోదావరి ఎలా వచ్చింది? వంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఆలయంలో శాస్త్రవేత్తలు సైతం ఛేదించలేని ఒక రహస్యాన్ని కూడా తెలుసుకుందాం. త్రయంబకేశ్వర క్షేత్రంలోని శివలింగం పానవట్టం నుంచి నిత్యం జలధార ఉబికి వస్తూనే ఉంటుంది. అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోందనేది ఎవరికీ అంతుబట్టని రహస్యం. శాస్త్రవేత్తలు సైతం ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారని చెబుతారు.

ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు ఉంటుంది. దీనిని పాండవులు నిర్మించారని చెబుతారు. ఈ కోనేరు నిత్యం గోదావరి జలాలతో నిండి ఉంటుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులంతా ఈ కోనేట్లోనే స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని విశ్వాసం. ఇక త్రయంబకంలో ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళ జరుగుతుంది.
సింహరాశిలోకి సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒకేసారి ప్రవేశించినప్పుడు సింహస్థ కుంభమేళాను నిర్వహించడం ఆనవాయితీ. ముక్కోటి దేవతలంతా ఈ కుంభమేళా సమయంలో త్రయంబకేశ్వర క్షేత్రానికి వచ్చి కొలువుదీరుతారని చెబుతారు.
