మహాకాళేశ్వరినికి రెండు రకాలుగా భస్మాభిషేకం జరుగుతుందని తెలుసుకున్నాం కదా. అందులో మొదటి రకం విభూత్యాభిషేకంలో ఆవు పేడతో తయారైన విభూతిని వినియోగిస్తారు. దానిని ముందుగా తెల్లని పలచని బట్టలో పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుని.. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోట మాత్రమే కాకుండా.. అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా అంతరాలయం భస్మంతో నిండిపోతున్న సమయంలో శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను మోగిస్తారు. ఆ సమయంలో అక్కడున్న భక్తులంతా అలైకిక స్థితికి వెళ్లిపోయిన అనుభూతిని పొందుతారు.

ఇక భస్మ హారతిలో రెండో రకం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ అభిషేకానికి ముందు ఆలయ అర్చకులు బ్రహ్మ ముహూర్తంలో శ్మశానికి వెళ్లి అక్కడ అప్పుడే కాలిన శవం నుంచి భస్మాన్ని సేకరిస్తారు. దానిని ఆలయానికి తీసుకుని వస్తారు. ఈ భస్మహారతిలో పాల్గొనే భక్తులంతా తప్పని సరిగా ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. అలా వస్తేనే అనుమతి.. లేదంటే తిప్పి పంపించేస్తారు. అనంతరం అర్చకులు శవం నుంచి సేకరించిన భస్మ పాత్రను భక్తులందరికీ అందజేస్తారు. మహాకాళేశ్వరుని చుట్టూ కూర్చొని శవ భస్మంతో ఆలయ అర్చకులతో పాటు భక్తులు సైతం స్వామికి భస్మాభిషేకం నిర్వహిస్తారు.
