
ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మపై ఒక తల్లి చిలక నివసించేది. ఆమెకు చిన్న చిన్న పిల్లలు ఉండేవారు. పిల్లలు పెద్దవవుతుండగా, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వేటగాడి బారినపడతారేమోనని తల్లి చింతించేది. ఒకరోజు పిల్లలు రెక్కలు కొడుతూ ఎగరడానికి సిద్ధమవుతున్నప్పుడు, తల్లి చిలుక వారిని పిలిచి.. “పిల్లలారా, మీకు ఒక మంచి పాట నేర్పుతాను, వినండి…” అంది. పిల్లలు ఆనందంగా దగ్గరికి వచ్చారు. అప్పుడు తల్లి ఇలా నేర్పింది. వేటగాడొస్తున్నాడు.. గింజలు విసురుతాడు.. వలవేసి పట్టుకుని మెడవిరుస్తాడు జాగ్రత్త అని చెప్పింది. పిల్లలు సంతోషంగా ఆ పాట నేర్చుకున్నారు. తల్లి మనసులో.. “హమ్మయ్యా! ఇక నా పిల్లలకి ఏమి భయం లేదు” అని నిశ్చింతగా అడవిలోకి వెళ్లిపోయింది.
కొద్దిసేపటికే వేటగాడు వచ్చాడు. పిల్లలు వెంటనే “వేటగాడొస్తున్నాడు. జాగ్రత్త!” అని పాట పాడసాగాయి. వేటగాడు ఆశ్చర్యపడి, భయపడి, చెట్టుచాటున దాక్కొని గింజలు విసిరాడు. అప్పుడు పిల్లలు మళ్లీ “గింజలు విసురుతాడు.. జాగ్రత్త!” అని పాడాయి. తరువాత వేటగాడు వల వేశాడు. పిల్లలు మళ్లీ “వల వేస్తాడు.. జాగ్రత్త!” అని పాడాయి. కానీ… అర్థం చేసుకోకుండా పాడుకుంటూనే ఆ వలపై పడిపోయాయి.వేటగాడు ఒక్కొక్కటిగా పట్టుకుని వారి మెడలు విరుస్తుండగా… ఇంకా పాడుతూనే ఉన్నవి: “మెడ విరుస్తాడు… జాగ్రత్త…” అంటూనే తుది శ్వాస విడిచాయి. పిల్లలు పాట అయితే నేర్చుకున్నాయి కానీ అర్థం గ్రహించలేదు. ఇదే మన జీవితం కూడా… మన పిల్లలు చదువులు నేర్చుకుంటారు, మనం కూడా శ్లోకాలు, మంత్రాలు, పురాణాలు, సహస్రనామాలు వింటాము, చదువుతాము. కానీ ఆచరణలో పెట్టకపోతే అంతా వృథా! భగవద్గీత కూడా పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం అని పెద్దలు చెబుతారు.
