ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతమైన చమోలి సమీపంలో కొలువైన కల్పేశ్వర్ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. దీని స్థల పురాణం ఏంటంటే.. ఈ ప్రదేశంలో శివుని జటాజూటం అంటే.. శిరోజాలు పడిపోయాయి. అందుకే ఇక్కడి శివుడిని జటాధరుడిగా పిలుస్తారు. అలాగే ఈ ప్రదేశంలో పూర్వకాలంలో ఒక కల్ప వృక్షం ఉండేదట. దాని కింద దుర్వాస మహర్షి తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతోంది. అయితే పంచ కేదారాలను దర్శించుకోవాలనుకునే వారు ఎలా పడితే అలా వెళ్లకూడదు. ఒక క్రమపద్ధతిలో మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్రను హరిద్వార్ నుంచి కానీ.. రిషీకేశ్ నుంచి కానీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ యాత్రలో ముందుగా గౌరీకుండ్ చేరుకుంటారు.

అక్కడ నుంచి ముందుగా కేదార్నాథ్ చేరుకోవాలి. కేదారనాథుని దర్శించుకున్నాక రాన్సీ మీదుగా ట్రెక్కింగ్ చేస్తూ వెళితే మధ్య మహేశ్వరుని ఆలయం వస్తుంది. అక్కడ దర్శనం పూర్తయ్యాక తుంగనాథ్‌కు బయలుదేరాల్సి ఉంటుంది. ఇక్కడికి కూడా ట్రెక్కింగ్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. దీని తర్వాత అత్యంత క్లిష్టమైన రుద్రనాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర చాలా కష్టంతో కూడుకున్నది. అడుగడుగనా ఆటంకాలను ఎదుర్కొంటూ రుద్రనాథుడిని దర్శించుకోవాలి. అనంతరం చివరిగా కల్పేశ్వర్ను దర్శించుకోవాల్సి ఉంటుంది. పంచకేదారాల దర్శనాననంతరం చివరిగా బద్రీనాథ్‌ను దర్శించుకుంటే పంచ కేదారాల యాత్ర పూర్తవుతుంది.
