ప్రస్తుతం మనం ఎనిమిదవ జ్యోతిర్లింగమైన గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలో గోమతి ద్వారక, బైట్ ద్వారక ద్వీపం మధ్య మార్గంలో నాగేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం. దీని స్థల పురాణంలో భాగంగా దారుక అనే రాక్షస దంపతుల గురించి తెలుసుకుంటున్నాం కదా. దారుక దంపతులు పశ్చిమ సముద్రంలోని ఓ ద్వీపం వద్ద ఉంటూ అటుగా వచ్చే వారందరిని బంధించి భక్షిస్తున్నారు. అలా శివ భక్తుడైన సుప్రియుడు దంపతులతో పాటు వారి అనుచరులను బంధించారు. ఈ క్రమంలోనే సుప్రియుడి దంపతులు తాము ఉంటున్న జైలులోనే శివుడి సైకత లింగం తయారు చేసి పూజించడం ఆరంభించారు.

అది చూసిన దారకుడు సుప్రియుడు క్షుద్ర పూజ చేస్తున్నాడని భావించి తన ఖడ్గంతో అతడిని సంహరించబోయాడు. అప్పుడు సైకత లింగం నుంచి కోటి సూర్యుల కాంతితో ఈశ్వరుడు ఉద్భవించి రాక్షస సైన్యాన్ని హతమార్చాడు. దారకుడిని సైతం సంహరించబోగా అతడి భార్య తన భర్తను కాపాడమంటూ పార్వతీదేవిని వేడుకుంది. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై తాను దారుక మాంగళ్యాన్ని కాపాడుతానని వరమిచ్చాను కాబట్టి దారకుడిని సంహరించవద్దని కోరింది. ‘భక్తులను కాపాడుతానన్న నీ మాట నిజమవ్వాలి.. అలాగే నా వరము సత్యమవ్వాలి’ అని పార్వతీదేవి తెలిపింది. నేటి నుంచి మీ రాక్షస ప్రవృత్తిని వీడి ఈ శివలింగాన్ని కలియుగాంతం వరకూ పూజించాలని చెప్పిందట. అందుకే అక్కడ శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగంగా దారుకావనంలో కొలువు దీరాడని ఆలయ స్థల పురాణం చెబుతోంది.
