బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥

ఈ శ్లోకం భగవంతుడు శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో జ్ఞాన యోగం గురించి చెప్పిన అత్యంత లోతైన వాక్యం. అనేక జన్మలపాటు సాధనచేసి, ఆత్మతత్త్వాన్ని గ్రహించిన వాడు చివరికి “వాసుదేవః సర్వమితి” అని అనుభవిస్తాడు. ఈ విశ్వమంతా వాసుదేవుడే, అన్నీ ఆయనే, అన్న భావనలో లీనమవుతాడు. ఇక్కడ “బహూనాం జన్మనాం అంతే” అంటే.. ఆధ్యాత్మిక మార్గంలో అనేక జన్మలపాటు చేసిన సాధన, తపస్సు, కర్మ, భక్తి, జ్ఞానం మొదలైనవి చివరికి ఒకే సత్యాన్ని తెలియజేస్తాయి. వాసుదేవుడు మాత్రమే సర్వమూ. అటువంటి జ్ఞానవంతుడు ఎటువంటి వేరుపు చూడడు, అతనికి దేవుడు మరియు జీవులు వేరు కాదు, అతని చూపులో సర్వమూ వాసుదేవమయమే.
“స మహాత్మా సుదుర్లభః” అటువంటి మహాత్ముడు అత్యంత అరుదు. ఎందుకంటే చాలామంది దేవుణ్ణి వేరు వేరు రూపాల్లో చూస్తారు, కానీ కొద్ది మంది మాత్రమే “అన్నీ ఆయనే” అని తెలుసుకుంటారు. ఈ శ్లోకం మనకు బోధిస్తున్నది ఏమిటంటే.. సత్యాన్వేషణ అనేది ఒక్క జన్మతో పూర్తి కాదు, అది అనేక జన్మల యాత్ర. నిజమైన జ్ఞానం అంటే, “అన్నీ వాసుదేవుడే” అని గ్రహించడం. ఆ అనుభూతిలో లీనమైనవాడు నిజమైన మహాత్ముడు. ఆత్మజ్ఞానం చివరికి భిన్నత్వాన్ని తొలగించి, ఏకత్వాన్ని చూపిస్తుంది. ఆ ఏకత్వమే వాసుదేవుడి దర్శనం, ఆత్మసాక్షాత్కారం.
