
కోనసీమ జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న అంతర్వేది స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా కొలువుదీరి లక్ష్మీ నరసింహస్వామిగా పూజలందుకుంటున్నాడు. పూర్వం హిరణ్యాక్షుని పుత్రుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున శివుడి గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడట. రక్తావలోచనుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రసన్నుడై అతను కోరిన వరాన్ని ప్రసాదించాడు. అదేమిటంటే.. తన శరీరం నుంచి ఒక్క రక్తపు బిందువు ఇసుక రేణువుల మీద పడినా కూడా దాని నుంచి అనేక మంది బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలనే వరాన్ని పొందాడు. వర గర్వంతో అతడు అందరినీ హింసించడం ప్రారంభించాడు.
యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను సైతం వదలకుండా హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి గొడవ జరిగింది. అప్పుడు విశ్వామిత్రుడి ఆదేశంతో రక్తావలోచనుడు ఇక్కడకు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరించాడు. అప్పుడు వశిష్టువారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా.. లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తి.. నరహరి అవతారంతో వచ్చి రక్తావలోచనుడిని సంహరించాలని సుదర్శన చక్రాన్ని వదిలాడు. రక్తావలోచనుడి శరీరం నుంచి రక్తపు బిందువులు ఇసుక రేణువులపై పడి వేల మంది రాక్షసులు తిరిగి పుట్టుకొచ్చారు. విషయం గ్రహించిన నరహరి తన మాయా శక్తితో రక్తావలోచనుడి రక్తం ఇసుకపై పడకుండా రక్త కుల్య అనే నదిలోకి ప్రవహించేట్లు చేశాడు. ఆ తరువాత తన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడిని సంహరించాడు. ఆ తరువాత వశిష్టుని కోరిక మేరకు లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి ఇక్కడే వెలిశాడు.
