
సూర్య భగవానుడికి చాలా మంది ఉదయం లేవగానే అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు. ఇది ఇప్పటి ఆచారం కాదు.. అనాదిగా వస్తున్నదే. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాతనే ఇతర పనులు చూసుకుంటారు. ఇలా చేయడం వలన ఏం జరుగుతుంది? అంటే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. సూర్య నమస్కారం వలెనే సూర్యుడికి అర్ఘ్య ప్రదానం కూడా ఎంతో ప్రీతిపాత్రమైనదట. ఇది ఎవరైనా సులభంగా ఆచరించవచ్చు. నిత్యం సమర్పించలేని వారు.. సప్తమి నాడు కానీ ఆదివారం నాడు కానీ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించవచ్చు.
సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేందుకు రాగి పాత్రను వినియోగిస్తారు. ఎందుకంటే.. సూర్యుడికి రాగి పాత్ర అంటే చాలా ఇష్టమట. ఆదిత్య పురాణంలో సూర్యభగవానుడే స్వయంగా తనకు తామ్రమే మహా ప్రీతి అని చెప్పాడని పండితులు చెబుతారు. కాబట్టి రాగి పాత్రను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, అందులో పవిత్రమైన నీటిని తీసుకుని అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. అర్ఘ్యం సమర్పించడానికి ముందు రాగి పాత్రలో శుద్ధమైన నీటిని తీసుకుని దానిలో ఎర్రచందనం, కుంకుమ, ఎర్రని అక్షతలు, ఎర్రని పువ్వులు, దూర్వాంకురాలు (గరికలు) కలుపుకుని సూర్యునికి ఎదురుగా ఒక పళ్ళెం పెట్టుకుని, ఆ పళ్ళెంలోకి నీటిని వదులుతూ అర్ఘ్యం ఇవ్వాలి.
