తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో కుర్తాళంలో చిత్రావతి జలపాతం ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఈ కుర్తాళంలో ఉన్న చిత్రావతి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుంచి అమిత వేగంగా కిందకు దూకుతూ ఉంటుంది. ఇది పర్యాటకులకు ఎంతో మధురమైన అనుభూతిని అందిస్తుంది. ఈ జలపాతం నీటిలో అనేక రకాల మూలికలు ఉంటాయని చెబుతారు. అందుకే ఈ జలపాతం నీటిలో స్నానం చేస్తే చికిత్సకు సైతం లొంగని మొండి వ్యాధులు కూడా నయమవుతాయి. అంతేకాదు మానసిక వికలాంగులు ఎవరైనా ఉంటే వారు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మత తొలగిపోతుందట. అలాగే శారీరక సమస్యలన్నింటి నుంచి విముక్తి లభిస్తుందట.

ఇక్కడ వెలసి ఉన్న నాడీ గణపతి అత్యంత పవర్ఫుల్ అని చెబుతారు. ఇక్కడి గణపతిని నాడి గణపతి అని పిలవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. మహా సిద్ధయోగి మౌనస్వామి తపస్సు చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకుని మఠాన్ని ఏర్పాటు చేసి ముందుగా శ్రీ సిద్దేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అనంతరం గణపతిని తీసుకొచ్చి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయాలనుకున్నారు. ఇది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వర్డ్ రాతి విగ్రహానికి ప్రాణప్రతిష్టేంటని ఎగతాళి చేశారట. విషయం తెలసుకుని సిద్ధయోగి.. గవర్నర్కు ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పగా పిలిపించాడట. విగ్రహానికి నాడి పరీక్షించమనగా వైద్యుడు ఆశ్చర్యపోయాడట. సరేనని నాడి పరీక్షించి సౌండ్ లేదని చెప్పాడట. ప్రాణ ప్రతిష్ట అనంతరం నాడి చూడమని చెప్పగా వైద్యుడు తన శతస్కోప్తో పరీక్షించి షాక్ అయ్యాడట. ఈ విషయాన్ని వైద్యుడు చెప్పడంతో బ్రిటీష్ గవర్నర్ సైతం గణపతికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడట.
