ఇవాళ మనం తెలుసుకోబోయే దేవాలయం అక్షరాభ్యాసం కోసం ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది.. మనం ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నామో అని..!

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం. ఇది సరస్వతీ దేవికి అంకితం చేయబడిన దక్షిణ భారతదేశంలోని ఏకైక దేవాలయం. ఈ దేవాలయం జ్ఞానం, వివేకం మరియు అభ్యాసానికి దేవత అయిన సరస్వతీ దేవికి అంకితం చేయబడింది.
బాసరలోని ప్రస్తుత ఆలయం చాళుక్యుల కాలం నాటిది. 6వ శతాబ్దంలో నందగిరిని (నేటి నాందేడ్) రాజధానిగా చేసుకుని పాలించిన కర్ణాటక రాజు బిజియలుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు.17వ శతాబ్దంలో, ఆలయం ముస్లిం ఆక్రమణ దారులచే విధ్వంసం చేయబడిన తర్వాత, నందగిరి అధిపతి ఆలయ విగ్రహాలను తిరిగి ప్రతిష్టించాడు.
ఈ దేవాలయ ప్రాంగణంలో వ్యాస గుహ అని పిలువబడే ఒక గుహ ఉంది. ఇక్కడ వేద వ్యాసుడు నివసించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ దేవాలయం అక్షరాభ్యాసం (పిల్లలకు విద్యను ప్రారంభించే వేడుక) కోసం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో సరస్వతీ దేవితో పాటు లక్ష్మీ మరియు కాళీ దేవతల విగ్రహాలు కూడా కొలువై ఉంటాయి. వసంత పంచమి రోజున ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 2:00 నుండి 8:30 వరకు వరకు తెరిచి ఉంటుంది. అక్షరాభ్యాసం చేయించేవాళ్ళు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 2:00 నుండి 6:00 వరకు చేయించవచ్చు.
