హిందూ ధర్మం ప్రకారం భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణానంతరం యమలోకానికి చేరుకుంటుంది. అక్కడ ఆత్మలు చేసిన పుణ్య,పాప కర్మల లెక్కలు తేలుస్తారు. పాపపుణ్యాలను లెక్కించే దైవిక అధికారి చిత్రగుప్తుడు. పురాణాల ప్రకారం, ధర్మం, అధర్మాల సమతుల్యత దెబ్బతినడంతో బ్రహ్మ తపస్సు చేయగా, ఆయన శరీరం నుంచి కలం, సిరాకుండతో ఒక శాంత స్వరూపుడు అవతరించాడు. అజ్ఞాతంగా కనిపించినందున ఆయనకు “చిత్రగుప్తుడు” అనే పేరు వచ్చింది. బ్రహ్మ ఆయనకు అగ్రసంధాని అనే దివ్య గ్రంథాన్ని ఇచ్చి… సమస్త జీవుల పుణ్య–పాపాలను లెక్కించే బాధ్యత అప్పగించారు. మన చర్యలు ప్రపంచానికి దాగి ఉండవచ్చు కానీ చిత్రగుప్తుడి దృష్టి నుంచి అవి తప్పించుకోలేవు. ప్రతి మాట, ఆలోచన, కర్మ అన్నీ ఆయన లెక్కల్లో నమోదు అవుతాయి. ఆ లెక్కల ఆధారంగానే యమధర్మరాజు ఆత్మలకు స్వర్గం లేదా నరకం నిర్ణయిస్తాడు. అందుకే ధర్మ మార్గంలో నడవాలని శాస్త్రాలు బోధిస్తున్నాయి.

