19 నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి మహాకుంభాభిషేకం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి విమానం(గోపురం) స్వర్ణమయం చేసే పనులు పూర్తయ్యాయి. ఆ తరువాత స్వామివారి మహాకుంభాభిషేకానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు స్వర్ణ విమానావిష్కరణ, మహా సంప్రోక్షణకు మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. దీనికోసం ఆలయ ప్రాంగణమంతా స్వాతగ తోరణాలతో అలంకరించారు. విద్యుద్దీపాలతో శోభాయమానంగా ఆలయం వెలిగిపోతోంది. కొండకింద రింగ్ రోడ్డు, గండిచెరువు తదితర ప్రాంతాలన్నింటినీ అందంగా ముస్తాబు చేశారు. ఐదు రోజుల పాటు నిర్వహించే నారసింహ హోమానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి.

ఈ క్రమంలోనే కుంభాభిషేకానికి ఆలయ ఉత్తర తిరువీధిలో హోమకుండాలను సైతం ఏర్పాటు చేశారు. హోమ గుండాల మధ్యలో స్వామివారిని ఆవాహన చేసి ప్రతిష్టించి యజుర్వేదాలు ఆలపించేందుకు 108 మంది రుత్వికులను ఆహ్వానించారు. అలాగే అదనంగా 15 మంది వంట స్వాములను సైతం ఆహ్వానించడం జరిగింది. ఈ నెల 22 వరకు 60మంది రుత్వికులు లక్ష్మీ, నరసింహ, సుదర్శన, రామాయణం, భాగవతం, మూల మంత్ర హవనాలు, మూల మంత్ర జపాలను నిర్వహించనున్నారు. అలాగే ఉదయం, సాయంత్రం విష్ణు, నరసింహ, రామాయణం, భాగవత పారాయణాలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ నెల 23న దిష్టికుంభం, నైవేద్యం, గుమ్మడికాయ, కొబ్బరికాయ సమర్పించి మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే మధుర పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక మహాయాగం నిర్వహించనున్నారు. మొత్తంగా ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.

Share this post with your friends