
నవరాత్రి సందర్భంగా అమ్మవారి అలంకరణలు ప్రారంభమయ్యాయి. ఒక్కో ఆలయంలో అమ్మవారి అలంకారాలు వేర్వేరుగా ఉంటాయి. మొత్తానికి అయితే నవదుర్గలని పిలుస్తారు. ఈ నవదుర్గల అలంకారాలు ఒక్క శ్రీశైలంలో మాత్రమే మనం దర్శించుకోగలుతుగుతామే.
శైలపుత్రి: సతీదేవి యోగాగ్నిలో దూకి తనని తాను ఆహుతి చేసుకున్న కథ గురించి తెలిసిందే. ఆ తర్వాత హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా సతీదేవి జన్మించింది. నవదుర్గలలో తొలి సవ్రూపం శైలపుత్రి. అమ్మవారు త్రిశూలం, కమలంతో చంద్రవక్ర కలిగి వృషభ వాహనంపై దర్శనమిస్తుంది.
బ్రహ్మచారిణి: నవదుర్గల్లో రెండో రూపం. శివుడి కోసం పార్వతీమాత జపమాల, కమండలంతో ఘోర తపస్సు ఆచరించిన రూపమే బ్రహ్మచారిణి స్వరూపం. ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల విజయాలు సిద్ధిస్తాయట.
చంద్రఘంట: నవదుర్గల్లో మూడో రూపం. బంగారు కాంతితో సింహ వాహనంపై మెరిసిపోతూ దర్శనమిస్తుంది. ఈ అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గం, బాణం సహా వివిధ అస్త్రాలు ధరించి దర్శనమిస్తుంది. తలపై అర్థచంద్రాకారంతో చంద్రఘంటా దేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది.
కూష్మాండ దుర్గ: నాలుగో స్వరూపం. అష్టభుజాలతో దర్శనమిస్తుంది. ఎనిమిది చేతుల్లో కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద , జపమాల ఉంటాయి.
స్కందమాత: నవదుర్గల్లో ఐదో రూపం. ఒడిలో చిన్నారి స్కందుడిని కూర్చోబెట్టుకుని పద్మంతో.. అలాగే అభయముద్రతో దర్శనమిస్తుంది.
కాత్యాయని: నవదుర్గల్లో ఆరో రూపం. చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. నాలుగు చేతుల్లో అభయ ముద్ర, వరముద్ర, ఖడ్గం, పద్మంతో సింహవాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది.
కాళరాత్రి: నవదుర్గల్లో ఏడవ రూపం. ఈ అమ్మవారు భయంకర రూపిణిగా దర్శనమిస్తుంది. కాళరాత్రి వాహనం గాడిద. వరముద్ర, అభయముద్ర, ఇనపముళ్ల ఆయుధం, ఖడ్గంతో దర్శనమిస్తుంది. దుష్టుల పాలిట సింహ స్వప్నంగా కాళరాత్రి దర్శనమిస్తుంది.
మహాగౌరి: నవదుర్గల్లో ఎనిమిదవ రూపం. మహా శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి పార్వతీదేవి శరీరం రంగు కోల్పోయిందట. అయితే అమ్మవారిని పాలతో అభిషేకం చేయగా శ్వేతవర్ణంలో మెరిసిపోతూ దర్శనమిచ్చే అమ్మవారి రూపాన్ని మహాగౌరిగా అభివర్ణిస్తారు.
సిద్ధిధాత్రి: నవదుర్గల్లో తొమ్మిదో రూపం. సర్వసిద్ధులను ప్రసాదించేదే సిద్ధిధాత్రి. దేవీ పురాణం ప్రకారం.. ఈ రూపం నుంచే శివుడు కూడా సిద్ధులు పొందాడట.
