వైభవంగా వన దేవతల జాతర.. గద్దెపైకి పెద్ద సార్లమ్మ, చిన్న సార్లమ్మ

వన దేవతలను గిరిజన ప్రాంతాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పిఆర్‎పురం మండలం రేకపల్లిలోనూ రెండేళ్లకోసారి వనదేవతల ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నిన్న రేకపల్లిలో ఈ ఉత్సవం జరిగింది. మేళతాళాల, డప్పుల సందడి మధ్య వనదేవతలు ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చాయి. వేలాది మంది తమ మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ నిప్పుల గుండాన్ని సైతం ఏర్పాటు చేస్తారు. ఈ నిప్పులగుండాన్ని తొక్కడానికి భక్తులు పోటీపడ్డారు. నాయకపోడు, కొండరెడ్లు సంయుక్తంగా ఈ జాతరను నిర్వహిస్తారు.

ఈ జాతర 10 రోజుల పాటు జరుగుతుంది. గత ఆదివారం దారపల్లి, కొటారు గొమ్ము గ్రామాల నుంచి పెద్దసార్లమ్మ, చిన్న సార్లమ్మలను ఈ గద్దె మీద ఉంచారు. వనదేవతలను తీసుకొస్తున్న సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున నీళ్ల బిందెలతో స్వాగతం పలికారు. మంగళహారుతులిచ్చి మరీ వనదేవతలను ఆహ్వానించారు. వనదేవతల ప్రతిమలను పట్టుకున్న పూజారులు నిప్పుల గుండంపై ముందుగా నడుస్తారు. ఆ తరువాత నిర్వహకులు, భక్తులు నడుస్తారు. ఈ నిప్పుల గుండం ఏర్పాటుకు కూడా పెద్ద తతంగమే ఉంటుంది. అడవికి వెళ్లి సరుగులు తీసుకొచ్చి గ్రామంలో ఊరేగించి రాత్రి పూజలు నిర్వహిస్తారు. ఆపై వాటిని నిప్పుల గుండంగా మారుస్తారు. ఆ నిప్పుల గుండాన్ని భక్తులు తొక్కుతారు.

Share this post with your friends