తిరుమలలో వైభవంగా వైశాఖ పౌర్ణమి గరుడసేవ

నిన్న పౌర్ణమి కావడంతో అన్ని ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. తిరుమలలోనూ వైశాఖ పూర్ణిమ సందర్భంగా పౌర్ణమి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి గరుడ సేవ తిరుమలలో సోమవారం రాత్రి 7 గంటలకు వైశాఖ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమాడ వీధులన్నీ భక్తుల గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో నాలుగుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends