శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన టీటీడీ

తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టీటీడీ తరఫున ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ జె శ్యామల రావు లు సారె సమర్పించారు. మే 06 తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 13వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. ముందుగా సారెకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకెళ్లారు. అంతకుముందు శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఎ. శ్రీనివాసులు కు టీటీడీ ఛైర్మన్ , టీటీడీ ఈవో అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి అని, భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారని తెలిపారు. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను ప్రతిబింబించేలా అపురూపంగా జాతర జరుగుతుందని చెప్పారు. టీటీడీ నిధులతో తాతయ్య గుంట గంగమ్మ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఇదే సహకారాన్ని భవిష్యత్తులో అందిస్తామన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ, ప్రతి ఏటా చైత్ర మాసంలో జాతర సందర్భంగా నాలుగో రోజున అమ్మవారికి టిటిడి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రూ. 60 లక్షలతో గంగమ్మ జాతరకు ఏర్పాట్లు చేశామని, రూ.3.50 కోట్లతో పలు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారని తెలిపారు.

Share this post with your friends