తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి శ్రీ అమర్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. విరాట్, శింబా, బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి. ఇందులో గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి. జాగిలాల ప్రదర్శన చూసిన వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో మాట్లాడుతూ.. భక్తులకు నాణ్యంగా, పరిశుభ్రంగా, రుచికరంగా, అన్నప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలతో అన్నప్రసాదాలు తయారు చేసేందుకు టివిఎస్ మోటార్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నామని తెలిపారు. భక్తులకు అందించే లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే నాణ్యమైన ముడిసరుకుల ఎంపికలో సూచనలు చేసేందుకు రిలయన్స్ రిటైల్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. తిరుమలలోని బిగ్ , జనతా క్యాంటిన్‌లలో నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు, క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీ కోసం నూతన విధానం అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.