రోగులకు వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్, టీటీడీ భక్తుల వసతి గృహం, విష్ణు నివాసంలలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదివారం వేకువ జామున నిర్వహించిన తనిఖీల్లో టిటిడి ఈవో వెంట టీటీడీ అధికారులు, స్విమ్స్ అధికారులు ఉన్నారు. ముందుగా స్విమ్స్ ఆసుపత్రిలో టీటీడీ ఈవో, టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయాల్లో వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. స్విమ్స్ లోని వార్డుల్లో ఆయా షిఫ్ట్ లలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలను సూచిక బోర్డుల్లో తప్పనిసరిగా పొందుపరచాలని ఈవో అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి లోపల, బయట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, భోజన సౌకర్యాలపై ఈవో రోగులను అడుగగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం స్విమ్స్ లోని అత్యవసర సేవల విభాగం, నెఫ్రాలజీ వార్డు, ఐసియూ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియాలజీ, ఆర్ఐసీయూ తదితర వార్డులను పరిశీలించారు.
విష్ణు నివాసంలలో ఈవో తనిఖీలు
తిరుపతిలోని శ్రీవారి భక్తుల వసతి సముదాయమైన విష్ణు నివాసంలో భక్తులకు అందుతున్న వసతి సదుపాయం, తదితర సౌకర్యాలను ఆదివారం వేకువ జామున టిటిడి ఈవో, జేఈవో పరిశీలించారు. విష్ణు నివాసంలో గదుల కొరత కారణంగా హాలు, సెల్లార్ లో ఉన్న భక్తులతో ఈవో మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనం కోసం వచ్చామని, సర్వదర్శనం టోకెన్లు పూర్తి అయిన నేపథ్యంలో తిరుమలలోని క్యూలైన్ల ద్వారా వెళ్లి దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నామన్నారు. సోమవారం తిరుమలలోని క్యూలైన్లలోకి నేరుగా వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్న సమాచారం ఉందా అని ఈవో భక్తులను అడుగగా, విష్ణు నివాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన సమాచారంపై నిరంతరం ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. సోమవారం రోజున తిరుమల క్యూలైన్లులోకి నేరుగా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చనే సమాచారాన్ని భక్తులకు నిరంతరం చేరవేసేలా మైకులు ద్వారా ప్రకటనలు ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు.