
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీఆర్.నాయుడు తాజాగా వేంకటేశ్వర స్త్రోత్రం ఆడియో ఆల్బమ్‌ను విడుదల చేశారు. తిరుమలలోని ఆయన కార్యాలయంలో ఈ ఆడియో ఆల్బమ్‌ను ఆవిష్కరించి అక్కడి వారికి వినిపించారు. బాల గాయని నియార నాగ సుంకరినేని వేంకటేశ్వర స్తోత్రంలోని పాటను ఆలపించింది. ఈ పాటకు నిటార నాగ సుంకరినేని అనే చిన్నారి వాద్య సహకారం అందించింది. ఇద్దరు చిన్నారులు కలిసి చేసిన ఈ ఆల్బమ్ కు డాక్టర్ కె.స్వరూపా సంగీత సమర్పకులుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా శ్రావ్యమైన సంగీతంతో పాటను మధురంగా గానం చేశారని చిన్నారులను టీటీడీ చైర్మన్ అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులను సత్కరించారు. మరిన్ని పాటలతో తన గానామృతాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బొల్లినేని రవీంద్రనాథ్, గాయని తల్లిదండ్రులు డాక్టర్ నిష్మా సుంకరినేని, డాక్టర్ నిఖిల్ సుంకరినేని పాల్గొన్నారు.
