
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ప్రముఖులకు ఆలయ అధికారులు అందజేస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు.. జూన్ 2 నుంచి 10వ తేది వరకూ అత్యంత వైభవంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడుకు బుధవారం ఆలయ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే టీటీడీ జేఈవో.. అధికారులను ఆదేశించారు. వాహన సేవల సమయంలో గాంధీ రోడ్డు, కర్నాల వీధుల్లో అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రధాన రహదారుల్లో ఆర్చీలు, స్వామివారి వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
