
తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం పెద్ద ఎత్తున అన్న ప్రసాద ట్రస్టును నిర్వహిస్తోంది. నిత్యం దాదాపు లక్ష మందికి అన్న ప్రసాదాలు అందజేస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్(KIOSK) మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ప్రారంభించారు.
ఈ మిషన్‌ను సౌత్ ఇండియన్ బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇవ్వవచ్చు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, సౌత్ ఇండియన్ బ్యాంకు జనరల్ మేనేజర్ శ్రీ టి.ఎం.మోహన్, ఏజీఎం శ్రీ వి.మధు, చీఫ్ మేనేజర్ శ్రీ వెంకట్ రావు, తిరుపతి బ్రాంచ్ హెడ్ శ్రీ అశోక్ వర్ధన్ పాల్గొన్నారు.
