ఇవాళ శ్రీవారి ల‌క్ష్మీ కాసుల హారం శోభాయాత్ర

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం వాహన సేవలతో అమ్మవారు భక్తులకు అభయమిస్తున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం జ‌రుగ‌నున్న గ‌జ‌వాహ‌న‌సేవ‌ నిర్వహించనున్నారు. ఈ గజవాహన సేవలో అమ్మవారికి తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని అలంకరించనున్నారు. ఈ క్రమంలోనే స్వామివారి లక్ష్మీ కాసుల హారాన్ని సోమ‌వారం ఉద‌యం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకెళ్ల‌నున్నారు.

ముందుగా తిరుమ‌లలో శ్రీ మలయప్ప స్వామివారి ఆల‌యం నుంచి ఈ హారాన్ని తీసుకొచ్చి ఆల‌య నాలుగు మాడ‌వీధుల్లో శోభాయాత్ర నిర్వహిస్తారు. అనంతరం హారాన్ని తిరుచానూరుకు తీసుకొస్తారు. తిరుచానూరులోనూ సంప్రదాయబద్దంగా దీనికి పూజలు నిర్వహిస్తారు. ముందుగా పసుపు మండపం వ‌ద్ద‌ హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఊరేగింపుగా ఆల‌యం వద్దకు తీసుకెళ్తారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి ల‌క్ష్మీ కాసుల హారాన్ని అలంకరిస్తారు.

Share this post with your friends