
శ్రీహరికి పరమ భక్తుడుగా, ఎప్పుడు నారాయణ నామాన్ని జపిస్తూ ముల్లోకాలు తిరుగుతూ కలహభోజనుడిగా పేరొందిన శ్రీ నారద మహర్షి జయంతి ఇవాళే (మే 14). అంటే నారదుడు వైశాఖ బహుళ విదియ రోజు జన్మించాడు. ఈ రోజున నారద అంతా నారద పురాణాన్ని పఠిస్తున్నారు. అయితే నారదుడిని తొలి జర్నలిస్ట్ అని కూడా అంటారు. నిత్యం నారాయణ నామస్మరణ చేస్తూ ముల్లోకాలనూ సంచరిస్తూ అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చేరవేస్తుండటంతో ఆయనను తొలి జర్నలిస్ట్‌గా అభివర్ణిస్తారు. నారదుని కారణంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మధ్య సైతం కలహాలు జరిగేవి.
నారదుడు సకలశాస్త్ర పారంగదుడు మాత్రమే కాకుండా సంగీత కోవిదుడు కూడా. అంతేకాకుండా.. నారదుడు పురాణాల ప్రకారం బ్రహ్మ మానస పుత్రుడని చెబుతారు. నారదుడిని కలహభోజనుడని పిలిచినా కూడా ఆ కలహాలన్నీ లోక కల్యాణం కోసమే సృష్టించేవాడు. నారదుడు పెట్టిన కలహంతో శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడగా.. అమ్మవారిని వెదుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూమిపైకి వచ్చి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించాడు. భక్తుల పాలిట కొంగు బంగారంగా కోనేటి రాయుడు పూజలందుకుంటుంటే.. కోల్హాపురిలో లక్ష్మీదేవి సైతం భక్తులకు సిరిసంపదలను ప్రసాదించే దేవతగా పూజలందుకుంటోంది.
