ఇవాళ రాధాష్టమి.. ప్రాముఖ్యత ఏంటంటే..

ప్రతీ ఏటా భాద్రపద మాసం శుక్లపక్ష అష్టమి రోజున జరిగే పర్వదినమే రాధాష్టమి. ఇది పవిత్రమైన ప్రేమకు చిహ్నం. ఈ రోజున భక్తులు రాధా–కృష్ణులను ఆరాధించి దాంపత్య, కుటుంబ సుఖసంతోషాలు, అనురాగం కలగాలని కోరుకుంటారు. భాద్రపద మాసం శుక్లపక్ష అష్టమి ఎప్పుడో కాదు.. ఇవాళే. ఈసారి రాధాష్టమి 2025 ఆగస్టు 31న జరుపుకోనున్నారు. రాధాష్టమి ప్రాముఖ్యత ఏంటంటే.. ఈ రోజు శ్రీకృష్ణుడి ప్రియతమ రాధా రాణి అవతరించిన పవిత్ర దినం. .రాధారాణి అపారమైన ప్రేమ, అంకితభావం వల్ల ఆమెను భక్తులు భక్తి స్వరూపిణిగా భావిస్తారు. రాధా–కృష్ణుల దివ్య ప్రేమ సకల లోకానికీ శాశ్వతమైన ఆధ్యాత్మిక స్ఫూర్తి.

ఈ రోజునరాధా–కృష్ణుల విగ్రహాలకు స్నానాభిషేకం చేసి, పుష్పాలతో, రత్నాభరణాలతో అలంకరిస్తారు. శ్రీకృష్ణ భక్తి గీతాలు, రాధా రాణి స్తుతి కీర్తనలు ఆలపిస్తారు. రాధమ్మకు ప్రత్యేక హారతి సమర్పించి, పవళింపు సేవ నిర్వహిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వలే ఈ రోజు భక్తులు ఉపవాసం పాటిస్తారు. రాధాష్టమి పూజ ఫలితాలు ఏంటంటే..

రాధారాణిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు మరింతగా పెరుగుతాయని భావిస్తారు. కుటుంబం ఐక్యత, సౌఖ్యం, ధనసంపద లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం రాధాదేవి స్వయంగా కృష్ణప్రియగా అవతరించి, కృష్ణ భక్తులకోసం భక్తి–ప్రేమ మార్గాన్ని చూపినవారుగా చెప్పబడింది. రాధా–కృష్ణుల ఏకత్వమే జీవాత్మ–పరమాత్మల కలయికకు ప్రతీక. రాధాష్టమి – ప్రేమ, భక్తి, అంకితభావానికి శాశ్వత ప్రతీక.

Share this post with your friends