యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులను ఆలయ అధికారులు ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు దివ్య విమాన గోపురానికి కళవరోహణ పూజలు నిర్వహించారు. అనంతరం దివ్య విమాన గోపుర సుదర్శన చక్రానికి నవ కలశ స్నాపనం, దేవత అవనం పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విచ్చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసే సమయానికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.
స్వామివారి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనుల బాధ్యతలను స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. వచ్చే ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ లోపు అంటే 2025 మార్చి లోగా బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈ పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు దేవాదాయ శాఖ నుంచి పలువురు సభ్యులుగా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిత్యం ఆలయం గోపురం బంగారు తాపడం పనులను పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలిస్తూ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూస్తోంది.