స‌ప్త ద్వారాల‌తో వైకుంఠాన్ని త‌ల‌పించిన‌ శ్రీ‌వారి కల్యాణవేదిక

ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని వెంక‌ట‌పాలెం శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగ‌ణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ‌నివారం ఏర్పాటు చేసిన కల్యాణవేదిక స‌ప్త ద్వారాలు, ఆనంద నిల‌యంతో వైకుంఠాన్ని తలపించాయి. రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి కల్యాణం తిలకించేందుకు వచ్చారు. చల్లటి సాయంత్రం వేళ శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి క‌ల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.

చెరుకులు, టెంకాయపూత, అరటి ఆకులు, మామిడాకులు, మామిడికాయలు, ఆఫ్రికన్‌ ఆరంజ్‌, గ్రీన్‌ ఆపిల్‌, రెడ్‌ ఆపిల్‌, నలుపు, ఆకుపచ్చ ద్రాక్ష, దోస, మొక్కజొన్న తదితర ఫలాలు, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. సంప్రదాయం ఉట్టిపడేలా 4 టన్నుల సంప్రదాయపుష్పాలు, 30 వేల కట్‌ ఫ్లవర్స్‌, వివిధ ర‌కాల ఫలాలు వినియోగించారు. ఇందులో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వ‌ర్యంలో బెంగళూరు, హైద‌రాబాద్‌కు చెందిన అలంకరణ నిపుణులు, టీటీడీ సిబ్బంది ఇందుకోసం పనిచేశారు.

Share this post with your friends