
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామివారి తెప్పోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఈ ఏడు రోజుల పాటు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అందంగా తెప్పను అలంకరించి విద్యుత్ దీప కాంతుల నడుమ దేవేరి సమేతులై స్వామివార్లు తెప్పపై విహరించారు. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి నిత్యం వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
తెప్పోత్సవాల్లో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
