
అంతర్వేది ఆలయం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. అంతర్వేది ఆలయ ప్రత్యేకతల్లో మొదటిగా చెప్పుకోవల్సినది విమాన గోపురం. ఇది ఐదు అంతస్తుల్లో ఉంటుంది. అలాగే ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక గరుడ విగ్రహంతో పాటు భక్త ఆంజనేయ స్వామివారు కొలువుదీరి దర్శనమిస్తూ ఉంటారు. ఆలయ గర్భగుడి పైకప్పుపై తాటి ఆకు మీద శ్రీకృష్ణుని “వటపత్ర సాయి” విగ్రహం ఒకే రాతితో చెక్కబడి ఉంటుంది. ఆలయంలో మరో విశేషం.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఒడిలో లక్ష్మీదేవి కూర్చొన్ని విగ్రహం ఉంటుంది. ఇక ఈ ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఆలయానికి తూర్పు వైపున రాజ్యలక్ష్మి దేవి, వేంకటేశ్వర స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయానికి ఉత్తరం వైపునకు వెళితే భూదేవి, రంగనాథ స్వామి దర్శనమిస్తారు. పశ్చిమాన చివరగా సంతాన గోపాల స్వామి, కేశవ స్వామి.. దక్షిణం వైపున ఆచార్యులు, ఆళ్వార్ల సన్నిధి, చతుర్భుజ ఆంజనేయుని విగ్రహాలు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా నీలకంఠేశ్వర స్వామిని వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా తిరు కల్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ రాత్రికి స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది.
