తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలో శ్రీ ప్రసన్నవేంకటరమణస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం రాజగోపుర కలశ స్థాపన చేసి హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో మహాకుంభారాధన, చతుస్థానార్చన, మూలమూర్తి హోమములు, ప్రాణ ప్రతిష్ట హోమం, గర్త పూజ, పిండికాపూజ, యంత్ర స్థాపన, మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, రాజగోపుర మహా కుంభ సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం మంగళ నీరాజనం, ఆచార్య బహుమానం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, రిత్వికులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటరమణ స్వామి వారి ఆలయం ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జనవరి 29 నుంచి 3వ తేదీ వరకూ జరిగింది. నేటి నుంచి ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4 నుంచి 12 వరకూ జరుగనున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లనూ ఆలయ అధికారులు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్నారు. భక్తులకు సైతం ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.