
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 08.00 నుండి 11.30 గంటల వరకు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, తిరుమంజనం, సమర్పణ, కవచ ప్రతిష్ట, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు.
అనంతరం శాత్తుమొరై, ఆస్థానం తదుపరి మధ్యాహ్నం 12.30 – 4.30 గం.ల మధ్య స్వామి అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. అంతకుముందు తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామ తం, చెరకు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉభయ నాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి సేవల్లో పాల్గొన్నారు.
