
తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు స్వామివారు గజవాహనంపై స్వామివారు శ్రీ గజ లక్ష్మీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు.
ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8 గంటలకు తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుండి 10 గంటల వరకు కల్యాణోత్సవం, రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.
