
శ్రీరామనవమి రాబోతోంది. ఈ పండుగకు దాదాపు నెల రోజుల ముందు నుంచే దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రిలో పండుగ కళ మొదలైపోతుంది. ఇప్పటికే పసుపు దంచడం, తలంబ్రాలను కలపడం.. రామయ్యను పెండ్లికొడుకును చేయడం వంటి పనులు అంగరంగ వైభవంగా జరిగాయి. వాస్తవానికి కల్యాణంలో అతి పవిత్రంగా భావించే వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం, సుగంధ ద్రవ్యాల మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియెగిస్తారు. జగత్ కల్యాణంగా భావించే భద్రాచలం సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో వినియోగించే తలంబ్రాలను గోటితో వలుస్తారు.
సీతారాముల కల్యాణంలో వినియెగించే గోటి తలంబ్రాలు సిద్ధం చేసే అరుదైన అవకాశం 11 ఏళ్లుగా ఒక్క ప్రాంతానికే దక్కుతోంది. ఈ ఏడాది కూడా ఆ భాగ్యం బాపట్ల జిల్లా చీరాల వాసులకి దక్కింది. కల్యాణ వేడుకలలో తలంబ్రాలను తాకడమే మహాద్భాగ్యమని భావిస్తారు. అలాంటి స్వయంగా సిద్ధం చేసే భాగ్యం దక్కితే ఆ ఆనందానికి అవధులుండవు. సీతారాములవారి కల్యాణానికి గడచిన 11 సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామా భక్త సేవ సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు వలుస్తున్నారు. ప్రతి ఏటా విజయ దశమి నాడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఉగాది వరకు అంటే ఆరు నెలలు పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. శ్రీరామనామ జపం చేస్తూ 10 టన్నుల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కల్యాణ వేడుకులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది.
