శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ

శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు సైతం పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఉదయం, సాయంత్రం స్వామివారి వాహన సేవలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు శ‌నివారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో మాట్లాడుతూ, శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

శ్రీశైలంతోపాటు వేములవాడ, శ్రీకాళహస్తి, సురుటుపల్లి, యాగంటి, మహానంది తదితర శైవాలయాలకు టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. 1996 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున శ్రీ మల్లికార్జున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు మాట్లాడారు. ఫిబ్ర‌వ‌రి 19న ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 1వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఆలయం వద్దకు చేరుకున్న ఈవో శ్రీ జె శ్యామల రావు కు శ్రీ‌శైలం ఆలయ ఈవో శ్రీ ఎం.శ్రీనివాస రావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. అనంత‌రం ఆలయ అధికారులు వీరికి తీర్థ, ప్రసాదాలు అందించారు.

Share this post with your friends