
శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి క్షేత్రంలో స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచనతో బంగారు స్వర్ణ రథోత్సవంలో స్వామి అమ్మవార్లు విహరిస్తున్నారు. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం మాడవీధులలో వైభవంగా స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. బంగారు స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులకు ఆది దంపతులు దర్శనమిచ్చారు. ప్రతి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు స్వర్ణ రధోత్సవం నిర్వహించేందుకు దేవస్థానం శ్రీకారం చుట్టింది.
రథానికి పుష్పాలంకరణ చేశారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు. ఇక రేపు ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో ప్రత్యేకంగా చెంచు మహిళలు పాల్గొనేందుకు వీల్పించామని ఆలయ అధికారులు తెలిపారు. చెంచులతో పాటు సాధారణ భక్తులను సైతం సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు అనుమతించనున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న వారందరికీ అన్న ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వ్రత సమయంలో తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
