తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 28 నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాదీ ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ రాత్రి 7.15 నుంచి 8.15 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో స్వామివారిని వేంచేపు చేయనున్నారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారితో పాటు సేనాధిపతివారిని, ఆళ్వార్లను ఆలయంలోని కల్యాణ మండపంలో వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 7న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 13న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 17న పెద్దశాత్తుమొర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.