
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది.
తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఈ ఈ లు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ సుధాకర్, డి ఈ శ్రీ చంద్రశేఖర్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
