ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళలో టీటీడీ నిర్వహించనున్న శ్రీవారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. ప్రయాగ్ రాజ్ సెక్టార్ – 6లో టీటీడీ చేపడుతున్న రోజువారి కార్యక్రమాలపై టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో జరుగనున్న శ్రీవారి కల్యాణోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉత్తరాది భక్తులు విరివిగా వచ్చే అవకాశం ఉంటుందని, భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా జనవరి 29న మౌణి అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాగ పౌర్ణమి, ఫిబ్రవరి 26న శివరాత్రి లాంటి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, టీటీడీ విజిలెన్స్ అధికారులు, ప్రయాగ్ రాజ్ పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి నమూనా ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు చేయాలని సూచించారు. శ్రీవారి భక్తులకు ఉచితంగా ఇచ్చే చిన్న లడ్డూలను సమకూర్చుకోవాలన్నారు. ప్రయాగ్ రాజ్‌లో టీటీడీ చేపడుతున్న రోజువారి శ్రీవారి కైంకర్యాలు, సౌకర్యాలను వర్చువల్ ద్వారా టీటీడీ ఈవోకు టీటీడీ అధికారులు నివేదించారు. శ్రీవారికి రోజువారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరుగుతున్న సేవలను వివరించారు. శ్రీవారి నమూనా ఆలయానికి రోజువారి భక్తులు ఎంత మంది వస్తున్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలు చేపడుతున్నారు, టీటీడీ సిబ్బందికి ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులను ఈవో అడిగి తెలుసుకున్నారు.