శ్రీ వేంకటేశ్వర భక్తి చైతన్య యాత్ర భక్తుల మధ్య శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలో విజయవంతంగా సాగింది. ఈ యాత్రలో 1200 మంది భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా టీటీడీ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పూజల అనంతరం యాత్ర ప్రారంభమైంది.
1. శ్రీ బాల త్రిపుర సుందరీ సమేత ఈశ్వరాలయం,
2. శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం,
3. శ్రీ భద్రకాళి సమేత వీర భద్ర స్వామి వారి ఆలయాలలో ప్రత్యేక హారతులు నిర్వహించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి చైతన్య యాత్రలో భజన, కోలాటం, తప్పెట గుళ్ల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భక్తుల “జయ గోవింద” నామస్మరణతో యాత్ర సాగింది. ఈ యాత్రలో 300 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పసుపు నీటితో వీధులను శుభ్రం చేసి హారతులు, టెంకాయలు కొట్టి యాత్రను ఘనంగా స్వాగతించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం సాధుమఠంకు చెందిన శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ, టిటిడి దేశవ్యాప్తంగా కళాబృందాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టిటిడి ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తుల జీవితాలను చైతన్యవంతంగా మార్చేందుకు తోడ్పడుతున్నాయని ప్రశంసించారు. ఈ యాత్ర భక్తుల ఆధ్యాత్మిక చైతన్యానికి దోహదపడటంతో పాటు, విజయనగరంలోని ప్రజల భాగస్వామ్యాన్ని గొప్పగా చాటిచెప్పింది.