
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందంగా అలంకరించిన తెప్పపై విద్యుద్దీప కాంతుల నడుమ రోజుకో స్వామివారు విహరిస్తున్నారు. తొలిరోజున సీతా సమేత శ్రీరాముడు తెప్పపై విహరించగా.. రెండవ రోజున రుక్మిణి సమేత శ్రీ కృష్ణ భగవానుడు విహరించాడు. ఇక మూడో రోజైన శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది.
దేవేరి సమేతుడైన శ్రీనివాసుడి ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. అనంతరం స్వామి, అమ్మవార్లు తెప్పలపై మూడుసార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెప్పోత్సవాలలో భాగంగా స్వామి పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన దశావతారాలు, పాండు రంగడు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల రూపాలతో విద్యుద్దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
