దేవేరులతో కలిసి పురుశైవారితోటకు వేంచేపు చేసిన శ్రీ మలయప్ప స్వామివారు

తిరుమలలో సోమవారం శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర జరిగింది. సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు. శేషహారతి, పుష్ప మాల‌, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచారు. అక్కడినుంచి స్వామి, అమ్మవార్లు తిరిగి ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ముగింపు సంద‌ర్భంగా సోమ‌వారం ఘ‌నంగా శాత్తుమొర జ‌రిగింది. ఇందులోభాగంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహించారు. అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకోనున్నది.

Share this post with your friends