
శ్రీ కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన అదనపు ఈవోకు శ్రీకాళహస్తీశ్వరాలయం ఈవో శ్రీ టి. బాపిరెడ్డి ఆలయ సంప్రదాయాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వస్త్రాల సమర్పణల అనంతరం ఆయన వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ దక్షిణాది మూర్తి దర్శనం అనంతరం ఆలయ ఈవో వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందించారు.
దక్షిణ భారతదేశంలో గొప్ప శైవక్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగొందుతోంది. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా విశేషంగా పెరగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు పరిసర ప్రాంత ఆలయాల సందర్శనలో భాగంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకుంటున్నారు. దేశ విదేశాల నుండి భక్తులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చి రాహుకేతు పూజలను నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి ప్రసిద్ధి చెందింది. శ్రీ మలయప్ప స్వామివారి చెల్లెలే భ్రమరాంబగా చెబుతారు. చెల్లెలు సౌభాగ్యం కోసం శ్రీవేంకటేశ్వరుడు పట్టువస్త్రాలు పంపుతారని భావిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామి, అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీ కాళహస్తీశ్వరుడికి గత 26 సంవత్సరాలుగా టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
