తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి విహారం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు సోమ‌వారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను క‌టాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

తెప్పలను అధిరోహించిన స్వామి, అమ్మ‌వార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా మంగ‌ళ‌వారం శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సీఎవో శ్రీ ఓ.బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవోలు శ్రీమ‌తి వి.ఆర్.శాంతి, శ్రీ సి. గోవింద రాజన్ ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Share this post with your friends