అయోధ్యలో శ్రీ శ్రీనివాసునికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు దంపతులు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. సరయూ నది ఒడ్డున కన్నుల పండువగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని వేద పండితులు, అర్చకులు నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉత్తరాది భక్తులు హాజరయాయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తాలైన శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తాలను అర్చకులు వల్లించారు. అభిషేకానంతరం తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు. సహస్రధారాపాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.