వేద పారాయణం నడుమ వేడుకగా శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం

శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్రకలశాభిషేకం ఆదివారం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేశారు. శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీ మనవాళపెరుమాళ్(శ్రీ భోగ శ్రీనివాసమూర్తి)ను, ఆయన కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఉంచారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేశారు.

అన‌గా శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి నిర్వహించే అభిషేకాధి క్రతువులు మూల‌మూర్తికి నిర్వహించిన‌ట్లు అవుతుంది. అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు ప్రత్యేక సహస్రకలశాభిషేకం వైభ‌వంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించారు. ఆలయంలో ఏకాంతంగా జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల్ దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, పేష్కార్ శ్రీ శ్రీహరి, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు, పడికావిలి ఏఈవో శ్రీ నాయక్, పార్‌ప‌త్తేదార్ శ్రీ తులసి ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends