
లక్షలాది మంది భక్తజనం నడుమ మేడారంలో వన దేవతల జన ప్రవేశం పూర్తయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలుకలగుట్ట నుంచి సమ్మక్క దేవతలు ఇద్దరినీ గద్దెలపై ప్రతిష్టించారు. సమ్మక్క రాకతో మేడారం ప్రాంగణం పులకించిపోయింది. మేడారం గద్దెల ప్రాంగణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మేడారం పరిసరాలన్నీ ఎటు చూసినా భక్తి భావంతో పులకించి పోతున్నాయి. సమ్మక్క-సారక్క నామస్మరణతో మారుమోగుతున్నాయి. పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని గద్దెలపైకి చేర్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ దివాకర్‌లు ఘన స్వాగతం పలకగా.. జిల్లా ఎస్పీ సుదీర్ రామ్‌నాథ్ కేకన్ గాలిలోకి కాల్పులు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలికారు. మహా జాతర ప్రారంభం రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకున్నారు. ఇక రెండవ రోజు గురువారం సమ్మక్క గద్దెలపైకి చేరుకుంది. గురువారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొదట సారలమ్మను గద్దెపై వన ప్రతిష్ట చేసిన మీదట చిలుకల గుట్టకు వెళ్ళి రహస్య పూజలు నిర్వహించారు. సాయంత్రం 6:43 నిమిషాలకు కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను పూజారులు చిలుకలగుట్ట నుండి కిందకు తీసుకువచ్చి మహాఘట్టాన్ని ఆవిష్కరించారు.
