పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైనా శనివారం ఉదయం ముత్యపు పందిరి వాహన సేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన 12 కళా బృందాలలోని 272 మంది కళాకారులు అమ్మవారికి కళా నిరాజనం సమర్పించారు. ఇందులో భాగంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కథక్, భరతనాట్యం, కూచిపూడి, కంజీర కోలాటం మరియు పిల్లనగ్రోవి వంటి జానపద నృత్యాలతో సహా అనేక రకాల నృత్య రూపాలను ప్రదర్శించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లుల మధ్య తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు పౌరాణిక పాత్రలను పోషించి భక్తులను అలరించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం జరిగిన ముత్యపు పందిరి వాహన సేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు.
భాగవత గాథలు – మహిళలు : ఆచార్య కె.సర్వోత్తమరావు
`
సకల వేదంతసారం భాగవతం. వేదవ్యాసమహర్షి. భగవంతుని అవతార లీలాగాథ వైభవంగా కీర్తించబడుతున్న భాగవతంలోని ప్రముఖ మహిళాపాత్రలను గురించి విశ్లేషిస్తున్నది ఈ గ్రంథం.
భాగవతంలోని మహిళల స్వరూప స్వభావాలను, వ్యవహార శైలిని, అభిప్రాయవ్యక్తీకరణను, కథాంశాలను అనుసరించి మహిళా దేవతలు, దివ్యమహిళలు, ప్రముఖమహిళలు, ద్వారకాపురమహిళలు, గ్రామీణ మహిళలుగా వర్గీకరించి వారి గురించి క్షుణ్ణంగా వివరించారు.
మహాభారత గాథలు – మహిళలు : ఆచార్య సుమతీ నరేంద్ర
`
భారతీయ సంస్కృతి అవగాహనకు శ్రీమద్రామాయణ, మహాభారత ఇతిహాసాలు కరదీపికల్లాంటివి.
భారతంలోని స్త్రీ పాత్రల కథలను చదివితే వారి వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు ఎంత ఉన్నతమైనవో తెలుస్తాయి. మహాభారతకాలంలో స్త్రీలకు శాస్త్రపరిజ్ఞానం ఉండేదనీ, సమయసందర్భాలను బట్టి వాటిని ప్రకటించేవారని తెలుస్తున్నది. ఇలాంటి మహిళలకు సంబంధించిన విశేషాలను సామాన్య పాఠకులకు తగినట్లు సరళమైన భాషలో రచన చేశారు.
రామాయణ గాథలు – మహిళలు : ఆచార్య కోలవెన్ను మలయవాసిని
ఆదికవి వాల్మీకి రచించి, మధురంగా గానం చేసిన కుటుంబగాథా కావ్యం, మానవతావిలువలతో నిండిన ఆదికావ్యం రామాయణం. వాల్మీకి సృష్టించిన ప్రతిపాత్ర ఎంతో ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.
ఇందులోని మహిళాపాత్రలు ఎంతో ఉజ్జ్వలంగా తీర్చబడినారు. ఈ కావ్యవస్తువును ముందుకు నడిపించిన వారంతా మహిళలే కావడం విశేషం.రామాయణంలోని మహిళలంతా వారివారి పాత్రౌచిత్యాన్ని చక్కగా నిర్వర్తించారు.
ఆర్యకథానిధి : శ్రీవావిలికొలను సుబ్బారావు
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి విశేష సేవ చేసిన శ్రీ వావిలికొలను వారి రచనలలో ‘ఆర్యకథానిధి’’ ప్రధానమైనది.
‘ఆర్యకథానిధిలో’ 132 కథలున్నాయి. ఈ కథలన్నీ ముఖ్యంగా శ్రీమద్రామాయణం, మహాభారతం, భాగవతాది గ్రంథాలలోనివే. ఇవేగాక పంచతంత్రం బృహత్కథలోనివి కూడా కొన్ని వున్నాయి. వీటితోబాటు జనవ్యవహారంలో వేళ్ళూనుకున్న కథలను కూడా తన రచనలో పొందుపరచినారు.