శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 25న జరుగనున్న పుష్పయాగానికి సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 గంటలకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం చేపట్టారు. మార్చి 25న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది.
ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తా రు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్లు శ్రీ రాజకుమార్, శ్రీ రమేష్, ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.