
నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుంచి అంటే నిన్నటి నుంచి విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వరణం, పుణ్యహం మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించారు. ఈ అష్టబంధన మహా సంప్రోక్షణ ఫిబ్రవరి 22వ తేదీ వరకు జరుగనుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 18న అంటే నేటి ఉదయం అష్ట బంధన సమర్పణ, సాయంత్రం పుణ్యాహం, పంచాగ్ని ప్రతిష్ఠ, కుంభ వాహనం, ఆరాధన, హోమం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 19న పంచ గవ్యాధివాసం, నవ కలశ స్నపనం చేపట్టనున్నారు. ఫిబ్రవరి 20న ఉదయం క్షీరాబ్ధివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఫిబ్రవరి 21న ఉదయం జలాధివాసం, సాయంత్రం మహా శాంతి తిరుమంజనం జరగనుంది. ఫిబ్రవరి 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గర్భాలయ మూలవర్ల మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.
