
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. నూతనంగా యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని నిర్మించారు. భవనంలోని హాళ్లు, కళ్యాణ కట్ట, మరుగుదొడ్లు, అన్న ప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తిరుమలలో యాత్రికుల వసతి సమస్యకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని టీటీడీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో 45 వేలమందికి మాత్రమే వసతి సౌకర్యాలు ఉన్నాయి., కొత్తగా నిర్మించిన పీఏసీ–5లో 2,500 మంది యాత్రికులకు వసతి లభిస్తుంది.
రానున్న బ్రహ్మోత్సవాల సమయం నాటికి ఈ వసతి సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నూతన పీఏసీ భవనంలో అనేక ఆధునిక మార్పులు చేశారు. 2,500 మందికి వసతి సౌకర్యం కల్పించినప్పటికీ, అవసరమైతే మరో 1,000 మంది యాత్రికులను కూడా సర్దుబాటు చేసేలా ఏర్పాట్లు చేశారు. అలాగే చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మిల్క్ ఫీడింగ్ గదిని సైతం ఏర్పాటు చేశారు. ఒకేసారి 1,400 మంది అన్నప్రసాదాలు స్వీకరించే విధంగా విస్తృతమైన అన్నప్రసాదాల హాలును ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్స కేంద్రం, కళ్యాణకట్ట, అన్న ప్రసాద వితరణ కేంద్రం, తదితర అన్ని అవసరమైన సదుపాయాలను ఈ భవనంలో కల్పించారు.
